డిజిటల్ జనగణనపై చైతన్యం – అమలాపురంలో 5కే రన్ నిర్వహణ
ప్రజా ఆయుధం దినపత్రిక
డిజిటల్ జనగణనపై చైతన్యం – అమలాపురంలో 5కే రన్ నిర్వహణ
ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 27:
దేశ డిజిటల్ జనగణనలో స్వీయ గణనకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలను భాగస్వాములను చేయడం లక్ష్యంగా అమలాపురంలో 5కే రన్ నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ నుండి గడియార స్తంభం వరకు నిర్వహించిన ఈ రన్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంతో పాటు జనగణన ప్రాముఖ్యతను ప్రజల్లో చాటిచెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. “మన గణన – మన బాధ్యత” అనే నినాదంతో ప్రతి పౌరుడు స్వీయ గణనలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
డిజిటల్ విధానంలో నిర్వహించే 2027 జనగణనలో ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా, ఖచ్చితంగా సమాచారం నమోదు చేయడం వల్ల సమయం ఆదా కావడమే కాకుండా డేటా నాణ్యత మెరుగవుతుందన్నారు. దేశ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పనలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. సాంకేతికతను వినియోగిస్తూ డిజిటల్ పద్ధతిలో జనగణన నిర్వహించడం ప్రత్యేకతగా నిలుస్తుందన్నారు.
స్థానిక ఎమ్మెల్యే ఎ. ఆనందరావు మాట్లాడుతూ ప్రజలు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేయడం వల్ల ఖచ్చితమైన సమాచారం అందుతుందని, ప్రతి ఒక్కరూ స్వీయ గణనలో పాల్గొనాలని సూచించారు.
మున్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ 2027 జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడే తొలి జనాభా గణనగా నిలుస్తుందని తెలిపారు. se.census.gov.in పోర్టల్ ద్వారా ప్రజలు తమ మొబైల్ ఫోన్లతోనే వివరాలను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. నమోదు చేసిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో ధృవీకరిస్తారని వివరించారు.
స్వీయ గణనలో నమోదు చేసే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని, ప్రజలు నమ్మకంతో పాల్గొని ఖచ్చితమైన సమాచారం అందించాలని అధికారులు కోరారు. మే నెలలో జరిగే గణన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంలో ఈ విధానం సహాయపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అర్థగణాంక అధికారి మురళీకృష్ణ, డీఆర్డీఏ పీడీ రాంబాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దుర్గారావు దొర, పీఆర్ డీఈ అన్యం రాంబాబు, కలెక్టరేట్ ఏఓ కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
![]()