దళితుని భూమిపై అక్రమాల ఆరోపణలు – చర్యలకు మాల మహానాడు డిమాండ్
ప్రజా ఆయుధం దినపత్రిక
దళితుని భూమిపై అక్రమాల ఆరోపణలు – చర్యలకు మాల మహానాడు డిమాండ్
ప్రజా ఆయుధం కడప, ఏప్రిల్ 27:
కడప జిల్లా చాపాడు మండలం బద్రిపల్లె గ్రామానికి చెందిన మాల కులానికి చెందిన డేగల ఆశీర్వాదం భూమిపై కన్నేసిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జి. చెన్నయ్య వర్గం జిల్లా అధ్యక్షుడు జేష్టాది భాస్కర్ డిమాండ్ చేశారు.
సోమవారం తన వర్గం సభ్యులతో కలిసి చాపాడు తహశీల్దార్ రామకుమారిని కలిసి సమస్యను వినిపించారు. బద్రిపల్లెలో డేగల ఆశీర్వాదానికి చెందిన సుమారు రెండు ఎకరాల చిలుకు భూమిని ఇటీవల కాలువ గుర్రప్ప పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన విషయాన్ని తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, సంబంధిత పత్రాలు మరియు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కాపీతో రిజిస్ట్రేషన్ రద్దు కోసం చర్యలు తీసుకోవచ్చని సూచించినట్లు తెలిపారు.
అనంతరం జేష్టాది భాస్కర్ విలేకరులతో మాట్లాడుతూ, 2012 మార్చి 3న డేగల ఆశీర్వాదం కాలువ గుర్రప్పకు మూడు సంవత్సరాల కాలపరిమితికి భూమిని ఒప్పందం ద్వారా ఇచ్చినట్లు తెలిపారు. గడువు ముగియడానికి ముందు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ, భూమిని ఆక్రమించుకునే ఉద్దేశంతో గుర్రప్ప సహకరించలేదని ఆరోపించారు.
రాజకీయ, ఆర్థిక బలం ఆధారంగా అధికారుల సహకారంతో రిజిస్ట్రేషన్ పత్రాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చివరకు భూమిని ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారని విమర్శించారు. భూమి విలువ ఎక్కువగా ఉండటంతోనే ఈ వివాదం తలెత్తిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో బాధితులు కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ పొందినట్లు వివరించారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిని ఆన్లైన్లో ఎలా నమోదు చేశారనే విషయంపై వివరణ కోరగా, ఇంజక్షన్ ఆర్డర్ సమర్పిస్తే ఆన్లైన్ నమోదు తొలగిస్తామని తహశీల్దార్ తెలిపినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో బాధితులు డేగల ఆశీర్వాదం, ఆయన కుటుంబ సభ్యులు, మాల మహానాడు యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేష్, జమ్మలమడుగు నియోజకవర్గ అధ్యక్షుడు రాజశేఖర్, ప్రొద్దుటూరు యూత్ ప్రెసిడెంట్ జాస్వర్, శరబుద్దిన్, వల్లి తదితరులు పాల్గొన్నారు.
![]()