డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రావులపాలెంలో మజ్జిగ చలివేంద్రం
ప్రజా ఆయుధం దినపత్రిక
డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రావులపాలెంలో మజ్జిగ చలివేంద్రం
ప్రజా ఆయుధం రావులపాలెం, ఏప్రిల్ 27:
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రావులపాలెం బస్టాండ్ వద్ద సోమవారం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ చలివేంద్రాన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ వై.వి.వి.వి.ఎన్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు దాహార్తి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటారని, ఇలాంటి చలివేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు, కార్మికులు, సాధారణ ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవిలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా బస్టాండ్ ప్రాంతంలో రోజూ వేలాది మంది రాకపోకలు సాగించే నేపథ్యంలో ఉచితంగా చల్లని మజ్జిగ అందించడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎం గురవయ్య నాయుడు, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ అచ్చమాంబ, ట్రస్ట్ ప్రెసిడెంట్ వల్లెం రాజేష్, సెక్రటరీ పిల్లా శ్రీదేవి, ఇతర ట్రస్ట్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వారు ట్రస్ట్ సేవా భావాన్ని అభినందించారు.
![]()