రెండు రోజుల్లో డీజిల్ సరఫరా సాధారణ స్థితికి – కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక
రెండు రోజుల్లో డీజిల్ సరఫరా సాధారణ స్థితికి – కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్
ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 27:
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీజిల్ సరఫరా రాబోయే రెండు రోజులలో సాధారణ స్థితికి చేరుకుంటుందని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్లో డీజిల్ కొరత అంశంపై ఏపీ ఈపీడీసీఎల్, వ్యవసాయ, మత్స్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్వా రంగ రేడియేటర్ల వినియోగం, వరి కోతల అవసరాలకు అనుగుణంగా డీజిల్ వినియోగంపై లక్ష్యాలు నిర్దేశించారు.
గత మూడు రోజులుగా సరఫరాలో చోటుచేసుకున్న అంతరాయాల కారణంగా ఆక్వా రంగంలో డీజిల్ వినియోగం పెరిగిందని, ప్రస్తుతం విద్యుత్ సరఫరా యథావిధిగా కొనసాగుతున్నందున ఆక్వా రంగంలో వినియోగం తగ్గుముఖం పడుతుందని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 872 హార్వెస్టర్లు రామచంద్రపురం, కె. గంగవరం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల్లో ముమ్మరంగా వరి కోతలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. వీటి డీజిల్ అవసరాల కోసం సచివాలయ వ్యవసాయ సహాయకులు కూపన్లను జారీ చేసి, ఆయిల్ క్యాన్ల ద్వారా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
మే నెలాఖరు నాటికి వరి కోతలు పూర్తవుతాయని, తద్వారా డీజిల్ వినియోగం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే ఆక్వా రంగంలో మత్స్యశాఖ సహాయకులు కూపన్లను జారీ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం చాలా చెరువుల్లో హార్వెస్టింగ్ పూర్తవగా, ఇంకా సుమారు 17 వేల చెరువులకు డీజిల్ అవసరం ఉందన్నారు.
జిల్లాలో మూతపడిన ఆయిల్ అవుట్లెట్ బంకులు ఈరోజు సాయంత్రం నుంచి మళ్లీ యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆయిల్ కంపెనీలతో సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.
డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, అవాస్తవ ప్రచారాల వల్ల ప్రజలు అవసరానికి మించి డీజిల్ నిల్వ చేసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోందని స్పష్టం చేశారు. ఎక్కడా బంకులు డ్రై అవుట్ కాకుండా సరిపడా సరఫరా అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే డీజిల్ వినియోగం 35 శాతం పెరిగిందని, అయినప్పటికీ డిమాండ్-సరఫరా సమతుల్యం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండల స్థాయి అధికారులతో పాటు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ పర్యవేక్షణ బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు.
అక్రమ డైవర్షన్‌ను నివారించేందుకు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ పెంచి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదే సమయంలో సోమవారం ఉదయం పేరూరులోని హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకును జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ వైఖోం నిధియా దేవి, డీఎస్ఓ ఉదయభాస్కర్, ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ రాజేశ్వరి, మత్స్యశాఖ అధికారి వర్ధన్, వ్యవసాయ అధికారి ఎన్.వి. రామారావు తదితరులు పాల్గొన్నారు.
![]()