పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ గిరిజనుల ధర్నా
ప్రజా ఆయుధం దినపత్రిక
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ గిరిజనుల ధర్నా
ప్రజా ఆయుధం నాగర్కర్నూల్, ఏప్రిల్ 27:
కొల్లాపూర్ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయం ముందు గిరిజనులు పోడు భూములపై సాగు చేస్తున్న తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ధర్నా నిర్వహించారు.
తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు ర్యాలీగా తరలివచ్చి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు హక్కులు కల్పించాలని, వెంటనే పట్టాలు మంజూరు చేయాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం బాల్య నాయక్ మాట్లాడుతూ, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల్లో పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. రెండు మండలాల్లో సుమారు 1200 ఎకరాల్లో సాగు చేస్తున్న గిరిజన రైతులకు హక్కులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి సాగు చేస్తున్న భూమికి 10 ఎకరాల వరకు పట్టా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నాయని ఆరోపించారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్నప్పటికీ గిరిజనులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్, ఆర్డీఓ అధికారులు స్వయంగా భూములను పరిశీలించి, నిజంగా సాగు చేస్తున్న గిరిజనులను గుర్తించి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దశలవారీగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అశోక్, కొల్లాపూర్ మండల అధ్యక్షుడు శ్రీను నాయక్, మండల కార్యదర్శి తిరుపతి నాయక్, నాయకులు డి వెంకట్, కే శక్రు, ఎం తార సింగ్, కే లక్ష్మణ్, డి లక్ష్మణ్, సురేష్, హరియా నాయక్, మహిళలు శారద, బుజ్జమ్మ, నాగోజి, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కొల్లాపూర్ ఆర్డీఓ బన్సీలాల్కు అందజేశారు.
![]()