మండపేటలో డీజిల్ సరఫరాపై అధికారుల సమీక్ష సమావేశం – అత్యవసర సేవలకు ప్రాధాన్యం
ప్రజా ఆయుధం దినపత్రిక
మండపేటలో డీజిల్ సరఫరాపై అధికారుల సమీక్ష సమావేశం – అత్యవసర సేవలకు ప్రాధాన్యం
ప్రజా ఆయుధం మండపేట, ఏప్రిల్ 26:
డీజిల్ సరఫరా పరిస్థితిపై మండపేట తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం రెవెన్యూ, సివిల్ సప్లైస్, వ్యవసాయ శాఖల సంయుక్త సమావేశం నిర్వహించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని 16 పెట్రోల్ బంకుల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి డీజిల్ లభ్యత, సరఫరాపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అత్యవసర సేవలైన అంబులెన్స్‌లకు, వ్యవసాయ పనుల నిమిత్తం కోత యంత్రాలు, ట్రాక్టర్లకు మొదటి ప్రాధాన్యత క్రమంలో డీజిల్ సరఫరా చేయాలని అధికారులు ఆదేశించారు. రైతులకు డీజిల్ అవసరమైతే గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ వ్యవసాయ సహాయకులు సంయుక్తంగా జారీ చేసే కూపన్లు తప్పనిసరి అని స్పష్టం చేశారు.
మండలంలోని ప్రతి పెట్రోల్ బంక్‌కు ఒక వీఆర్ఓ చొప్పున నియమించి పర్యవేక్షణ చేపట్టారు. పెట్రోల్, డీజిల్ నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని బంక్ యాజమాన్యాలను ఆదేశించారు. పరిస్థితిని బట్టి అవసరమైన చోట పోలీస్ బలగాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
డీజిల్ కొరత రాకుండా సంబంధిత ఆయిల్ కంపెనీలకు తరచూ ఇండెంట్లు పంపించాలని సూచించారు. బంక్ యజమానులు లేవనెత్తిన సమస్యలు, సూచనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో రెవెన్యూ డిప్యూటీ తహశీల్దార్ పి.ఏ. మెహర్ బాబా, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహశీల్దార్ బి. ప్రసన్న జ్యోతి, మండల వ్యవసాయ అధికారి కె. ప్రభాకర్, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ ఎం. పద్మనాభం, మండపేట మండల పెట్రోల్ బంకుల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో వీఆర్ఓలు, వీవీఏలు రైతులకు అందుబాటులో ఉండి కూపన్లు జారీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
![]()