మండపేటలో డీజిల్ కొరత తీవ్రం – తక్షణ చర్యలు చేపట్టాలని కిసాన్ కాంగ్రెస్ డిమాండ్
ప్రజా ఆయుధం దినపత్రిక
మండపేటలో డీజిల్ కొరత తీవ్రం – తక్షణ చర్యలు చేపట్టాలని కిసాన్ కాంగ్రెస్ డిమాండ్
ప్రజా ఆయుధం మండపేట, ఏప్రిల్ 25:
తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గ పరిధిలోని మండపేట టౌన్, మండపేట రూరల్, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రంగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు తెలిపారు. శనివారం మండపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పలు పెట్రోల్ బంక్ల వద్ద డీజిల్ అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పంట కోతల సమయం కావడంతో డీజిల్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ పనులు, నీటి పంపింగ్ పనులు ఆలస్యం అవుతున్నాయని, దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
అలాగే ఆటో, రవాణా వాహనాల డ్రైవర్లు, చిన్న వ్యాపారులు కూడా డీజిల్ కొరతతో తీవ్రంగా ప్రభావితమవుతున్నారని చెప్పారు. డీజిల్ కోసం గంటల పాటు వేచి ఉండటంతో వారి దినసరి ఆదాయం దెబ్బతింటోందని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో సరఫరా పరిమితంగా ఉండటం, సరైన సమయానికి రాకపోవడమే సమస్యకు కారణమని పేర్కొన్నారు. బంక్ల వద్ద ప్రజలు వాటర్ క్యాన్లు, పెద్ద డ్రమ్ములతో బారులు తీరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు ఎక్కడా కొరత లేదని చెబుతూ తప్పుడు ప్రకటనలు చేయడం విచిత్రమని కామన విమర్శించారు. పరిస్థితి మరింత విషమించకముందే జిల్లా కలెక్టర్, సివిల్ సప్లయ్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. క్షేత్రస్థాయిలో అధికారులను పంపి ప్రతిరోజూ నివేదికలు సేకరించాలని, ప్రతి పెట్రోల్ కంపెనీ సరఫరాను పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యపై ఇప్పటికే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేశానని, రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రైతులు, వాహనదారులకు డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
![]()