వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతులకు మేలు – మంత్రి సుభాష్
ప్రజా ఆయుధం దినపత్రిక
వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతులకు మేలు – మంత్రి సుభాష్
ప్రజా ఆయుధం రామచంద్రపురం, ఏప్రిల్ 25:
వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతులు ఆధునిక పద్ధతులు అనుసరించి మరింత ప్రయోజనం పొందవచ్చని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులతో సాధారణ సమావేశం ద్రాక్షారామంలోని మార్కెట్ యార్డ్లో కమిటీ అధ్యక్షుడు అక్కల రిష్వంత్ రాయ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో రైతులకు ఉపయోగపడే పలు ముఖ్య అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పుంత రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసి గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపర్చాలని సభ్యులు కోరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు అవసరమైన యంత్రాలు, పనిముట్లు అందించేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ యార్డ్లో విక్రయించేందుకు ప్రోత్సహించాలని సూచించారు.
మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అక్కల రిష్వంత్ రాయ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి పలు సమస్యలను నివేదించగా సానుకూల స్పందన లభించిందన్నారు.
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సేకరణ కేంద్రాల ద్వారా రైతులకు లబ్ధి చేకూరుస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దడల నాగార్జున నాగేశ్వరి, పాలకవర్గ సభ్యులు, కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి. వాసుదేవరావు, వ్యవసాయ శాఖ ఏడి బి. నాగకుమార్ తదితరులు పాల్గొన్నారు.
![]()