స్వచ్ఛ సర్వేక్షన్-2026లో మెరుగైన ర్యాంక్ కోసం మండపేట మున్సిపాలిటీ కసరత్తు
ప్రజా ఆయుధం దినపత్రిక
స్వచ్ఛ సర్వేక్షన్-2026లో మెరుగైన ర్యాంక్ కోసం మండపేట మున్సిపాలిటీ కసరత్తు
ప్రజా ఆయుధం మండపేట, ఏప్రిల్ 25:
స్వచ్ఛ సర్వేక్షన్-2026లో మెరుగైన ర్యాంక్ సాధించేందుకు మండపేట పురపాలక సంఘం విస్తృత స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. శనివారం పట్టణంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో శుభ్రతపై చైతన్యం కల్పించారు.
తూర్పు గోదావరి జిల్లా స్వచ్ఛ సర్వేక్షన్ కో-ఆర్డినేటర్ వెంకట్రావు మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. 15వ వార్డు ధర్మగుండం, 27వ వార్డు పార్థసారథి నగర్ ప్రాంతాల్లో తడి, పొడి, ప్రమాదకర చెత్తలను వేరుచేసి రంగుల డబ్బాలలో వేయడం, హోం కంపోస్టింగ్, మిద్దె కంపోస్టింగ్ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అదేవిధంగా మెప్మా ఆర్.పి లకు హోం కంపోస్టింగ్ బిన్స్ పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ టి.వి. రంగారావు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి వాణి మహల్ మీదుగా సర్దార్ వేగుళ్ళ వీర్రాజు సంత మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో భాగంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్, క్యారీ బ్యాగుల వినియోగాన్ని తగ్గించి గుడ్డ సంచులు ఉపయోగించాలని వ్యాపారస్తులకు సూచించారు. స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించడంతో పాటు మానవహారం నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎం. సత్తిరాజు, మెప్మా సి.ఎం. పి. సుజాత, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
![]()