వాహనాల దిగ్బంధనంలో పెట్రోల్ బంకులు – డీజిల్ కొరతతో స్తంభించిన రాకపోకలు
ప్రజా ఆయుధం దినపత్రిక
వాహనాల దిగ్బంధనంలో పెట్రోల్ బంకులు – డీజిల్ కొరతతో స్తంభించిన రాకపోకలు
ప్రజా ఆయుధం కొత్తపేట, ఏప్రిల్ 25:
డీజిల్ కొరత కొత్తపేట పట్టణంలో తీవ్ర ప్రభావం చూపుతోంది. వాహనాలతో పెట్రోల్ బంకులు దిగ్బంధనంలో చిక్కుకోవడంతో అమలాపురం–రావులపాలెం ప్రధాన రహదారి పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. దీంతో సుమారు రెండు గంటల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి.
స్థానిక ఎస్సై జి. సురేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ట్రాఫిక్ చట్రంలో ఇరుక్కున్న ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. అత్యవసర పనులతో బయలుదేరిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇక డీజిల్ కొరత ప్రభావం వ్యవసాయ రంగంపైనా పడింది. వరి కోతల సీజన్ ముమ్మరంగా సాగుతున్న సమయంలో డీజిల్ అందుబాటులో లేకపోవడంతో కోత యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పంట కోతల్లో ఆలస్యం జరిగే అవకాశముందని, వాతావరణ పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితిపై ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి పెట్రోల్, డీజిల్ కొరత నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు. అధికారులు పరిస్థితిని సమీక్షించి సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
![]()