ధాన్యం సేకరణలో జాప్యం జరిగితే కఠిన చర్యలు: జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిధియా దేవి
ప్రజా ఆయుధం దినపత్రిక
ధాన్యం సేకరణలో జాప్యం జరిగితే కఠిన చర్యలు: జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిధియా దేవి
ప్రజా ఆయుధం ఉప్పలగుప్తం, ఏప్రిల్ 25:
ధాన్యం సేకరణలో ఎలాంటి జాప్యం జరిగినా లేదా రైతుల నుంచి ఫిర్యాదులు అందినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిధియా దేవి కొనుగోలు సిబ్బందిని హెచ్చరించారు.
శనివారం ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి-1 గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తేమ శాతాన్ని పరికరాల ద్వారా పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు.
ధాన్యం సేకరణకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన అనంతరం, క్షేత్రస్థాయిలో అమలవుతున్న విధానంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, మరింత వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలన్నారు.
ప్రస్తుతం కోతకు వచ్చిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆలస్యం చేయకుండా తక్షణమే వేగవంతం చేయాలని మండల స్థాయి అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కొనుగోలు సిబ్బందికి సూచించారు. మార్గదర్శకాలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అమలు చేయాలని, నిబంధనల ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యతా ప్రమాణాల మేరకు ధాన్యం సేకరణ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ పి. శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎం.వి. రామారావు, జిల్లా సహకార శాఖాధికారి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
![]()