డీజిల్ సరఫరాపై ఆందోళన అవసరం లేదు: కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక
డీజిల్ సరఫరాపై ఆందోళన అవసరం లేదు: కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్
ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 25:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, సాధారణంగా సరఫరా జరుగుతున్నప్పటికీ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ ప్రచారాల వల్ల ప్రజలు అవసరానికి మించి డీజిల్ నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోందని పేర్కొన్నారు.
ప్రస్తుతం వరి కోతల కాలం కావడంతో వ్యవసాయ అవసరాల కోసం డీజిల్ డిమాండ్ పెరిగిందని, అలాగే ఆక్వా కల్చర్ రంగంలో విద్యుత్ కోతల కారణంగా రొయ్యల చెరువుల వద్ద ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ వినియోగం అధికమైందన్నారు.
డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలకు జిల్లాకు సరఫరాను 10 శాతం పెంచాలని ఆదేశించామని తెలిపారు. ఎక్కడా పెట్రోల్ బంకులు డ్రై అవుట్ కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
వరి కోత యంత్రాలకు డీజిల్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా గ్రామ వ్యవసాయ అధికారుల ధృవీకరణ పత్రం విధానం అమలు చేస్తున్నామని, రైతులు లేదా యంత్రాల ఆపరేటర్లు వి.ఏ.ఓ. సంతకం చేసిన పత్రాన్ని చూపిస్తే ప్రాధాన్యతతో డీజిల్ అందిస్తారని వివరించారు.
అత్యవసర సేవలు, రేషన్ సరుకుల రవాణాకు ఎటువంటి అంతరాయం లేకుండా డీజిల్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే లేదా అధిక ధరలకు విక్రయం జరిగితే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా ప్రజలు, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
![]()