ముమ్మిడివరంలో ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక
ముమ్మిడివరంలో ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్
ప్రజా ఆయుధం ముమ్మిడివరం, ఏప్రిల్ 25:
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముమ్మిడివరం ప్రాంతంలోని ఎయిమ్స్ కళాశాల మూడో అంతస్తులో ఏర్పాటు చేసిన ఈవీఎంలు, వివి ప్యాట్ల భద్రత గోదామును జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆర్. మహేష్ కుమార్ శనివారం క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
నిర్దేశిత నెలవారీ తనిఖీలలో భాగంగా రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి ఈ పరిశీలనలు నిర్వహించారు. గోదాము వద్ద భద్రతా ఏర్పాట్లు, సీలింగ్ విధానం, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించి సందర్శన రిజిస్టర్లో సంతకం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, గోదాము వద్ద 24 గంటల పటిష్ట నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి నెలా తనిఖీలు నిర్వహించి నివేదికలను భద్రపరచాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అగ్నిమాపక సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ, భద్రతా వలయాన్ని దాటి అనధికార వ్యక్తులు ఎవరూ లోపలికి ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం తహసీల్దార్ సుభాష్, ఎలక్షన్ డ్యూటీ ఉప తహసీల్దార్ శివరాజ్ తదితర రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
![]()