ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి
ప్రజా ఆయుధం దినపత్రిక
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి
ప్రజా ఆయుధం నాగర్ కర్నూల్, ఏప్రిల్ 24:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ వ్యక్తమైంది. నాగర్ కర్నూల్ కేంద్రంలోని బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నేతలు మాట్లాడారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు పొదిల రామయ్య మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, యూనియన్లను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అయితే సమ్మె ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు.
రెండున్నర సంవత్సరాల కాలంగా ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో కార్మికులను జిల్లాలకు పంపిస్తూ, అక్కడి నుంచి నేరుగా ఇంటికి పంపే విధంగా ప్రణాళికలు ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేశారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 53 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు పోరాటం సాగించారని, ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. అందుకే మళ్లీ కార్మికులు సమ్మెకు దిగారని అన్నారు.
ఇప్పటికైనా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
![]()