నకిలీ కరెన్సీ చలామణి గ్యాంగ్ అరెస్ట్ – పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా
నకిలీ కరెన్సీ చలామణి గ్యాంగ్ అరెస్ట్ – పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా
రామచంద్రపురం, ఏప్రిల్ 20 (ప్రజా ఆయుధం):
రామచంద్రపురం మండలంలోని అంబికాపల్లి గ్రామంలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అభినందించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 20 ఉదయం అంబికాపల్లి గ్రామంలోని ఒక కిరాణా దుకాణానికి ఇద్దరు వ్యక్తులు వచ్చి రూ.500 నోటును మార్పిడి చేయడానికి ప్రయత్నించారు. దుకాణ యజమానికి అనుమానం రావడంతో నోటును పరిశీలించగా అది నకిలీగా గుర్తించారు. వెంటనే వారిని ప్రశ్నించగా మోటార్ సైకిల్‌పై పారిపోవడానికి ప్రయత్నించగా స్థానికుల సహాయంతో వారిని అదుపులోకి తీసుకుని రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఫిర్యాదు ఆధారంగా క్రైం నెంబర్ 62/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు పలివెల నూకరాజు ఇతరులతో కలిసి ఆర్థిక లాభం కోసం నకిలీ రూ.500 నోట్లు చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
విచారణలో నూకరాజుకు జైల్లో పరిచయమైన మీసాల అప్పలరాజు, బత్తుల శ్రీను, మట్టాడి దేవి ప్రసాద్‌లతో కలిసి నకిలీ కరెన్సీ తయారీకి కుట్ర పన్నినట్లు వెల్లడైంది. బెయిల్‌పై విడుదలైన అనంతరం వేములపల్లి గ్రామంలోని వైఎస్ఆర్ నగర్లో ఒక గదిని అద్దెకు తీసుకుని నకిలీ నోట్ల ముద్రణకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేసి రూ.500 నకిలీ నోట్లు ముద్రించడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల సమాచారంతో పోలీసులు వేములపల్లి గ్రామంలోని గదిపై దాడి నిర్వహించి మీసాల అప్పలరాజు, బత్తుల శ్రీను, మట్టాడి దేవి ప్రసాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.500 నకిలీ నోట్ల 46 పేపర్లు, ముద్రణ పరికరాలు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో మొత్తం నిందితులను అరెస్టు చేసి, స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలతో పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ కేసును ఛేదించిన రామచంద్రపురం సీఐ ఎం. వెంకటనారాయణ, ఎస్ఐ ఎస్. నాగేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది సేవలను జిల్లా ఎస్పీ ప్రశంసించారు.
![]()