ఎస్సై నుంచి ఎస్పీ వరకూ ప్రస్థానం…నక్క సూర్యచంద్రరావు విజయగాథకు అభినందనలు
ప్రజా ఆయుధం దినపత్రిక
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఎస్సై నుంచి ఎస్పీ వరకూ ప్రస్థానం…నక్క సూర్యచంద్రరావు విజయగాథకు అభినందనలు
పి. గన్నవరం, ఏప్రిల్ 15:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం బోడపాటి వారి పాలెం గ్రామానికి చెందిన నక్క సూర్యచంద్రరావు 1989లో సబ్ ఇన్స్పెక్టర్గా పోలీస్ శాఖలో తన సేవలను ప్రారంభించి, క్రమంగా సర్కిల్ ఇన్స్పెక్టర్, డీఎస్పీ, ఏఎస్పీ వంటి కీలక పదవుల్లో పనిచేస్తూ తన ప్రతిభ, క్రమశిక్షణ, సేవా తపనతో ఉన్నత స్థానాలకు ఎదిగి ఇటీవల పదోన్నతి పొంది విజయవాడలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం గర్వకారణంగా నిలిచింది.
ఈ సందర్భంగా పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, ఒక సాధారణ ఉద్యోగిగా ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవడం వెనుక నక్క సూర్యచంద్రరావు గారి కష్టపాటు, అంకితభావం, క్రమశిక్షణ ఉన్నాయని కొనియాడారు. ఒక ఉద్యోగి తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు, అవరోధాలు ఎదురవుతాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిన ఆయన ప్రయాణం యువతకు గొప్ప స్ఫూర్తి అని అన్నారు.
పోలీస్ శాఖలో ఆయన చేసిన సేవలు మరువలేనివని, ప్రజల భద్రత, చట్ట పరిరక్షణలో ఆయన ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా, నిజాయితీగా వ్యవహరించి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందిన అధికారి అని తెలిపారు.
అభినందన సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నక్క సూర్యచంద్రరావు పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు మరియు వారి సతీమణికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ శాఖ సిబ్బంది, బంధుమిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నక్క సూర్యచంద్రరావుకు శుభాకాంక్షలు తెలిపారు.
![]()