డీఎస్పీ మురళీకృష్ణ సమక్షంలో పోలీసు స్టేషన్లకు భారీ గేట్ల ప్రారంభం – రోడ్డు భద్రతపై ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అవగాహన
ప్రజా ఆయుధం దినపత్రిక
డీఎస్పీ మురళీకృష్ణ సమక్షంలో పోలీసు స్టేషన్లకు భారీ గేట్ల ప్రారంభం – రోడ్డు భద్రతపై ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అవగాహన
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట, ఏప్రిల్ 18: అంబాజీపేట మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ ఆవరణంలో సుమారు రూ.7 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన భారీ గేట్లను పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ గేట్లను అమలాపురం శ్రీనిధి హాస్పిటల్ సమకూర్చింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సేవా కార్యక్రమంలో భాగంగా గేట్ల ఏర్పాటు చేసిన హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గేట్లు గన్నవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
పోలీసు వ్యవస్థ ప్రాముఖ్యతను వివరిస్తూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అమూల్యమని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీసుల సహకారం కీలకమని తెలిపారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమరాజు ఆధ్వర్యంలో నాలుగు మండలాల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి బాటిళ్లు, గ్లూకోజ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కొంతమంది వాహనదారులకు హెల్మెట్లు కూడా అందజేశారు.
కార్యక్రమంలో భాగంగా ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను తెలియజేశారు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ఎమ్మెల్యే అతివేగం ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇటీవల అంబాజీపేటలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ, హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పేదని చెప్పారు. అందువల్ల ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ మురళీకృష్ణ, కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, నాలుగు మండలాల ఎస్సైలు, కానిస్టేబుళ్లు మరియు ఇతరులు పాల్గొన్నారు.
![]()