ఆక్వా ప్రాన్ విధానం గురుకుల పాఠశాలలకు అనుకూలం – జిల్లా కలెక్టర్
ఆక్వా ప్రాన్ విధానం గురుకుల పాఠశాలలకు అనుకూలం – జిల్లా కలెక్టర్
ప్రజా ఆయుధం దినపత్రిక
ముమ్మిడివరం, ఏప్రిల్ 18:
ఆక్వా ప్రాన్ విధానం గురుకుల పాఠశాలలకు అనుకూలం – జిల్లా కలెక్టర్
కోనసీమ వంటి అధిక వర్షపాతం, తేమ ఉన్న ప్రాంతాల్లో ఆక్వా ప్రాన్ విధానం గురుకుల పాఠశాలలకు అత్యంత అనువైనదని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు.
శనివారం మండల పరిధిలోని తానేలంక సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్మిస్తున్న ఆక్వా ప్రాన్ విధాన ప్లాంట్‌ను ఆయన పరిశీలించారు. ఈ ప్లాంట్ ద్వారా మరుగుదొడ్ల నుండి వచ్చే వ్యర్థాల్లోని నీటిని, మలాన్ని వేరు చేసి నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతో సెప్టిక్ ట్యాంకులు త్వరగా నిండిపోవడం ప్రధాన సమస్యగా మారిందన్నారు. మరుగుదొడ్ల నుండి వచ్చే అధిక నీరు ట్యాంకుల్లోకి చేరడం దీనికి ప్రధాన కారణమని చెప్పారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఆక్వా ప్రాన్ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు రూ.1.10 కోట్ల వ్యయంతో 11 యూనిట్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధానంలో మలాన్ని వేరు చేసి సేంద్రియ ఎరువుగా మార్చడం, నీటిని శుద్ధి చేసి మొక్కల పెంపకానికి వినియోగించడం జరుగుతుందని చెప్పారు.
ఈ విధానం వల్ల సెప్టిక్ ట్యాంకులను తరచుగా శుభ్రం చేయాల్సిన అవసరం తగ్గుతుందని, ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. అలాగే దోమల వ్యాప్తి తగ్గి, క్యాంపస్‌లో పచ్చదనం పెరుగుతుందని పేర్కొన్నారు.
అనంతరం ముమ్మిడివరం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు.
- ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ఏవీఎస్ రాజన్, డీసీహెచ్ఎస్ కార్తీక్, డీఈలు రాంప్రసాద్, రాజేంద్ర సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
![]()