గృహ గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై కఠిన చర్యలు – కోనసీమలో హోటళ్లపై ఆకస్మిక దాడులు
గృహ గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై కఠిన చర్యలు – కోనసీమలో హోటళ్లపై ఆకస్మిక దాడులు
ప్రజా ఆయుధం దినపత్రిక
అమలాపురం, ఏప్రిల్ 18:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా హోటళ్లలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ హెచ్చరించారు.
శనివారం జిల్లా పౌరసరఫరాల అధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో వివిధ హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్న 18 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన 12 మంది వ్యక్తులు మరియు సంస్థలపై 6-A సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
గృహ అవసరాల కోసం కేటాయించిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్యాస్ రీ-ఫిల్లింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ఒక సిలిండర్ నుండి మరొక సిలిండర్‌కు గ్యాస్ మార్చి విక్రయించే ముఠాలపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.
వాణిజ్య వినియోగదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో కమర్షియల్ గ్యాస్ సరఫరా 70 శాతానికి పెంచినట్లు తెలిపారు. హోటళ్లు మరియు ఇతర వాణిజ్య సంస్థలు కేవలం కమర్షియల్ సిలిండర్లనే వినియోగించాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని డీఎస్ఓ ఉదయభాస్కర్ తెలిపారు. ఈ దాడుల్లో ఏఎస్ఓ శరత్, పీఎంయూ ప్రతినిధి వి. చంద్రశేఖర్ రెడ్డి, సి.ఎస్.డి.టి.లు ఇస్మాయిల్, భారతి తదితరులు పాల్గొన్నారు.
![]()