స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్రలో జలహారతి కార్యక్రమం ఘనంగా – జలవనరుల సంరక్షణకు ప్రజా భాగస్వామ్యం అవసరం: కలెక్టర్ మహేష్ కుమార్
స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్రలో జలహారతి కార్యక్రమం ఘనంగా – జలవనరుల సంరక్షణకు ప్రజా భాగస్వామ్యం అవసరం: కలెక్టర్ మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక
అమలాపురం, ఏప్రిల్ 18:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతతో పాటు జలవనరుల సంరక్షణ ప్రధాన లక్ష్యంగా వివిధ కార్యక్రమాలను ప్రజా భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నట్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు.
శనివారం అమలాపురంలోని చంద్రబాబు నాయుడు మున్సిపల్ పార్కులో జలధార–జలహారతి కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మున్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటి సంరక్షణ, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా, నీటి వనరులను కాపాడేలా ఈ కార్యక్రమం సమాజానికి ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుందన్నారు.
ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలసికట్టుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జిల్లాకు రాష్ట్రంలో ప్రధమ స్థానం తీసుకురావాలని పిలుపునిచ్చారు. కోనసీమ అభివృద్ధి, ఆరోగ్యకర జీవన విధానం కోసం పరిశుభ్రత మరియు జల సంరక్షణపై కట్టుబడి పనిచేయాలని స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.
కాలువలు, నదుల వద్ద జలహారతి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి నీటి బొట్టును ఆదా చేస్తూ, జలవనరులను కలుషితం కాకుండా కాపాడాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర శ్రమదానం ద్వారా కాలువల పూడికతీత, చెత్త తొలగింపు వంటి కార్యక్రమాలు సామూహికంగా చేపట్టినట్లు వివరించారు.
స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ ‘స్వర్ణాంధ్ర–2047’ లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. వర్షపు నీటిని నిల్వ చేసి అవసరాలకు వినియోగించుకోవాలని, నీటి కాలుష్యాన్ని నివారించాలని సూచించారు.
మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఇంకుడు గుంటలు నిర్మించుకోవాలని, డ్రైనేజీ వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పార్కులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద జలహారతి నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కలశం సెంటర్ వద్ద డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి, మురుగునీరు సజావుగా పారేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వి. దివాకర్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
![]()