బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే అంబేద్కర్ లక్ష్యం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
ప్రజా ఆయుధం దినపత్రిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే అంబేద్కర్ లక్ష్యం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
కె. గంగవరం, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని కె. గంగవరం మండలంలో కుయ్యేరు, కావూరివారిపేట, నామాడివారిపేట, గంగవరం, తామరపల్లి, సత్యవాడ గ్రామాల్లో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మంత్రి, అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలు భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు. సమాజంలో సమానత్వం, న్యాయం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన జీవితాంతం కృషి చేశారని తెలిపారు.
ప్రతి పౌరుడికి ఓటు హక్కు అనే శక్తివంతమైన ఆయుధాన్ని అందించి ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేసిన మహానుభావుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. ప్రజలు తమకు నచ్చిన నాయకులను ఎన్నుకునే హక్కు రాజ్యాంగం ద్వారా లభించిందని గుర్తు చేశారు.
అంబేద్కర్ ఆశయాలను ప్రతీ ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరణలో పెట్టాలని, సమ సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కె. గంగవరం మండల టిడిపి అధ్యక్షులు మేడిశెట్టి రవికుమార్, జనసేన పార్టీ అధ్యక్షులు సిర్రా రాజకుమార్, స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ సలాది రమేష్, డీసీ నిడదవోలు సుబ్రహ్మణ్యం, ఏఎంసీ డైరెక్టర్ ఖండవల్లి శ్రీనివాసరావు, బలుసు శివప్రసాద్, కాటే సుబ్రహ్మణ్యం, రవ్వా భూషణం, బుంగా రాజు, నల్లా సుధాకర్, మురార్జీ తదితరులు పాల్గొన్నారు.