పి. గన్నవరం నియోజకవర్గంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు – ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
ప్రజా ఆయుధం దినపత్రిక
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
అంబేద్కర్ అంటే క్రమశిక్షణకు ప్రతీక… యువత ఆయన మార్గంలో నడవాలి
పి. గన్నవరం నియోజకవర్గంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు – ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
పి. గన్నవరం, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పి. గన్నవరం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ హాజరై అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ… అంబేద్కర్ అంటే కేవలం ఒక మహానుభావుడు మాత్రమే కాదని, క్రమశిక్షణ, పట్టుదల, దీక్షకు నిలువెత్తు నిదర్శనం అని కొనియాడారు. ఆయన జీవితంలో ప్రతి అడుగు ఒక సందేశమని, ముఖ్యంగా యువత అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని సూచించారు.
“అంబేద్కర్ అంటే ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్. ఆయన ఆలోచనలు, విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరిస్తేనే నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్య ద్వారా సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన అంబేద్కర్ ఆశయాలను యువత తమ జీవిత లక్ష్యంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రజలతో కలిసిమెలిసి నివాళులు అర్పించారు. వివిధ గ్రామాలు, వార్డుల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని అంబేద్కర్‌కు ఘనంగా జయజయధ్వానాలు పలికారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన అందించిన రాజ్యాంగం వల్లే నేడు ప్రతి పౌరుడికి సమాన హక్కులు లభిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం స్థాపనలో అంబేద్కర్ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గస్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.