అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్.. నియోజకవర్గవ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు
ప్రజా ఆయుధం దినపత్రిక
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్.. నియోజకవర్గవ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు
అమలాపురం, ఏప్రిల్ 14:
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అమలాపురం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అమలాపురం పట్టణంలోని 9వ వార్డు, పేరూరు మరియు భీమనపల్లి గ్రామాల్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎత్తు రోడ్ వద్ద ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. సమాజంలో పేరుకుపోయిన అన్యాయాలను, చెడులను నిర్మూలించేందుకు అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. ఆయన కేవలం ఒక వర్గానికే పరిమితం కాకుండా యావత్ దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడని అన్నారు.
అంబేద్కర్ గారు జీవితాంతం కుల నిర్మూలన, సామాజిక సమానత్వం కోసం పోరాడారని గుర్తు చేసిన ఎమ్మెల్యే, ఆయన రచించిన రాజ్యాంగం వల్లే ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అపారమని కొనియాడారు.
బాబాసాహెబ్ ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, ఆటో డ్రైవర్లు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.