మహనీయుడు అంబేద్కర్ – ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
ప్రజా ఆయుధం దినపత్రిక
బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో అందరం పునరంకితమవుదాం…
ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ – ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
కొత్తపేట, ఏప్రిల్ 14:
అణగారిన వర్గాల అభ్యున్నతి, సమానత్వ సమాజ నిర్మాణం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం సదా ఆచరణీయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వాడపాలెం పెదపేట, కొత్తపేట రెడ్డీపవారిపేట, కొత్తపేట బస్టాండ్ సెంటర్, కమ్మిరెడ్డిపాలెం, రావులపాలెం క్యాంపు కార్యాలయం తదితర ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంబేద్కర్ గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, రాజనీతి కోవిదుడిగా దేశానికి చెక్కుచెదరని రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. భారతదేశానికి దిశా, దశ నిర్దేశం చేసే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు.
అస్పృశ్యతను ఎదుర్కొంటూనే ఉన్నత విద్యను అభ్యసించి లండన్ ఎకనామిక్స్ స్కూల్లో చదివి ఆర్థిక శాస్త్రంలో ఉన్నత పట్టాలు సాధించిన మహోన్నత వ్యక్తిగా అంబేద్కర్ నిలిచారని చెప్పారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం లక్ష్యాలతో సమ సమాజ నిర్మాణం కోసం ఆయన రాజ్యాంగాన్ని రూపొందించారని వివరించారు.
అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతున్నదంటే అది అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లేనని పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి సమాన ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని బలపరిచారని అన్నారు. “బోధించు – సమీకరించు – పోరాడు” అనే అంబేద్కర్ సందేశం ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు.
తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అంబేద్కర్ ఆశయాల సాధనలో ముందుంటుందని పేర్కొంటూ, ఎన్టీ రామారావు కృషితోనే అంబేద్కర్‌కు భారతరత్న లభించిందని గుర్తు చేశారు. పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు వంటి గౌరవాలు కూడా ఆ కాలంలోనే సాధ్యమయ్యాయని తెలిపారు.
అనంతరం రావులపాలెం క్యాంపు కార్యాలయం నుండి కోనసీమ ఆర్చ్ వరకు ర్యాలీగా వెళ్లి, అక్కడ అంబేద్కర్ చిత్రపటానికి మరియు ఇందిరా కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లి మంగాదేవి భీమారావు, ముత్యాల బాబ్జి, కంఠంశెట్టి శ్రీనివాస్, కె.వి. సత్యనారాయణ రెడ్డి, గుత్తుల రాంబాబు, చిలువూరి సతీష్ రాజు తదితరులు పాల్గొన్నారు.