అంబేద్కర్ ఆశయాల సాధనలో ముందుకు సాగుదాం – మంత్రి సుభాష్ పిలుపు
ప్రజా ఆయుధం దినపత్రిక
అంబేద్కర్ అందరివాడు.. యుగ పురుషుడు
సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించిన మంత్రి వాసంశెట్టి సుభాష్
అంబేద్కర్ ఆశయాల సాధనలో ముందుకు సాగుదాం – మంత్రి సుభాష్ పిలుపు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం, ఏప్రిల్ 14:
భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయానికి ప్రతీక అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం పట్టణంలో ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం, మెయిన్ రోడ్, జల్లిపేట, జగన్నాయకుల పాలెం ప్రాంతాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ సామాజిక సమానత్వం కోసం, కుల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, మహిళల హక్కుల పరిరక్షణ, కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.
అంబేద్కర్ చేసిన పోరాటం సమాజంలో వివక్షకు గురవుతున్న ప్రతి వర్గానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దడం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తిగా ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు.
అంబేద్కర్ ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకమని, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని ఆయన నమ్మకాన్ని గుర్తుచేస్తూ యువత విద్యపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సమానత్వ సమాజ నిర్మాణం వైపు అందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రామచంద్రపురంలో అంబేద్కర్ భవన్ నిర్మిస్తాం – మంత్రి సుభాష్ హామీ
ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు రామచంద్రపురం పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి సుభాష్, ఏడాది లోపు అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అంబేద్కర్ జయంతి రోజున ఈ హామీ ఇవ్వడం పట్ల సంఘాల నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ పై రచించిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.