అంబేద్కర్ సమానత్వానికి ప్రతీక… ప్రపంచ స్థాయి మేధావి: కలెక్టర్ మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక
అంబేద్కర్ సమానత్వానికి ప్రతీక… ప్రపంచ స్థాయి మేధావి: కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం, ఏప్రిల్ 14:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమానత్వాన్ని పునాదిగా తీసుకుని పనిచేసిన మహానుభావి అని, ఆయన ఒక వర్గానికో, ప్రాంతానికో పరిమితమైన నాయకుడు కాదని, ప్రపంచ స్థాయి మేధావిగా నిలిచారని కొనియాడారు. కుల వివక్ష నిర్మూలన, స్త్రీ సాధికారత, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమని పేర్కొన్నారు.
అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే నేడు ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం లభిస్తున్నాయని తెలిపారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ యువతలో అవగాహన పెంపొందించి సామాజిక న్యాయం, సమానత్వం వైపు ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఇతర వెనుకబడిన వర్గాల విద్య, ఉపాధి, అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా అమలవుతున్నాయని, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, విద్యా సంక్షేమ పథకాలు వంటి కార్యక్రమాలు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
ఆర్డీవో జి మమ్మీ మాట్లాడుతూ అంబేద్కర్ జీవితమంతా మానవ హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంకితం అయిందని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో ఆచరించాలని సూచించారు.
ఇతర వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ అస్పృశ్యత నిర్మూలన, సమాన హక్కుల సాధన కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమని, ఆయన రూపొందించిన రాజ్యాంగమే భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. యువత ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ విద్య, క్రమశిక్షణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, ఈ జ్యోతిలక్ష్మి దేవి, ఏవో కాశీ విశ్వేశ్వరరావు, డి రత్నకుమార్, వికాస జిల్లా మేనేజర్ జి రమేష్, రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.