అణగారిన ప్రజల కోసం భగవంతుడు పంపిన అవతారమే అంబేద్కర్.. నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆనందరావు
ప్రజా ఆయుధం దినపత్రిక
అణగారిన ప్రజల కోసం భగవంతుడు పంపిన అవతారమే అంబేద్కర్.. నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆనందరావు
చెడుపై విజయానికే బాబాసాహెబ్ జన్మించారు.. అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ఆనందరావు
అమలాపురం, ఏప్రిల్ 14:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారత రత్న, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అమలాపురం పట్టణంలోని గడియార స్తంభం, మద్దాల వారి పేట, నల్లవంతెన ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచమే గర్వించదగ్గ మహామేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. సమాజంలో పేరుకుపోయిన చెడును నిర్మూలించేందుకు, అన్యాయాన్ని అరికట్టేందుకు భగవంతుడు అప్పుడప్పుడు మహానుభావులను పంపుతారని, అణగారిన వర్గాల విముక్తి కోసం అంబేద్కర్ ఒక అవతారంగా అవతరించారని వ్యాఖ్యానించారు.
మహాత్మా జ్యోతిరావు పూలేను తన గురువుగా భావించి ఆయన ఆశయాల దిశగా అంబేద్కర్ సాగారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. చదువుతోనే విముక్తి సాధ్యమని నమ్మి విద్యకు ప్రాధాన్యతనిచ్చిన అంబేద్కర్, మహిళా సాధికారతకు కూడా పెద్దపీట వేశారని తెలిపారు.
అంబేద్కర్ జీవితాంతం కులవ్యవస్థ నిర్మూలన, సామాజిక సమానత్వం, మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాడారని ఎమ్మెల్యే అన్నారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం వల్లే నేడు ప్రతి పౌరుడికి ఓటు హక్కు, స్వేచ్ఛ, సమాన అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు. పేదలు, అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికే బాబాసాహెబ్ జన్మించారని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.
అనంతరం నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి జయభీమ్ నినాదాలతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువత మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.