సంఘ సంస్కర్తల్లో అగ్రగణ్యుడు మహాత్మ జ్యోతిరావు పూలే – ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
ప్రజా ఆయుధం దినపత్రిక
సంఘ సంస్కర్తల్లో అగ్రగణ్యుడు మహాత్మ జ్యోతిరావు పూలే – ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
రావులపాలెంలో పూలే భవన్ నిర్మాణం చేపడతాం
రావులపాలెం, ఏప్రిల్ 11:
భారతదేశంలోని సంఘ సంస్కర్తల్లో అగ్రగణ్యుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు.
శనివారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో సంస్కరణలు, అంటరానితనం నిర్మూలన, సామాజిక న్యాయం, రాజకీయ హక్కుల కోసం మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన పోరాటం అపారమని కొనియాడారు. కుల, మత, లింగ వివక్షతలపై పోరాడి సమానత్వ సమాజ నిర్మాణానికి పునాది వేశారని అన్నారు.
సావిత్రిబాయి పూలేతో కలిసి బాలికల విద్యకు శ్రీకారం చుట్టి తొలి పాఠశాల ప్రారంభించడం గొప్ప విప్లవమని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న వివక్షత తొలగించి విద్యా వ్యాప్తి కోసం చేసిన కృషి అనన్యసామాన్యమన్నారు.
రైతుల సమస్యలపై గులాంగిరి వంటి రచనలు చేసి చైతన్యం కలిగించారని తెలిపారు. సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన సాధనమని ప్రజలకు బోధించిన మహనీయుడు పూలే అని పేర్కొన్నారు.
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రావులపాలెంలో మహాత్మ జ్యోతిరావు పూలే భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, స్థల సేకరణ చేపట్టి త్వరలోనే నిర్మాణం సాకారం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.