పూలే సేవలు ఆదర్శం – ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు
ప్రజా ఆయుధం దినపత్రిక
పూలే సేవలు ఆదర్శం – ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు
శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు
మండపేట, ఏప్రిల్ 11:
మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు ఈ తరం యువతకు ఆదర్శమని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు.
మండపేటలో శెట్టి బలిజ సంఘం అధ్యక్షుడు బండి గోవిందు ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక పెద్ద కాల్వ వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన సేవలను దేశం ఎప్పటికీ మరవదన్నారు. స్త్రీ విద్యకు పునాది వేసిన మహనీయుడని కొనియాడారు. 1848లో పూణేలో భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి దేశంలోనే తొలి బాలికల పాఠశాలను ప్రారంభించడం ఒక విప్లవాత్మక అడుగని పేర్కొన్నారు.
ఆడపిల్లలకు విద్య నిషేధంగా భావించిన కాలంలో పూలే దంపతులు చేసిన కృషి గొప్పదని అన్నారు. కులవ్యవస్థ, అంటరానితనం, మూఢనమ్మకాలపై సత్యశోధక సమాజ్ ద్వారా పోరాటం చేసి సమానత్వానికి మార్గం సుగమం చేశారని తెలిపారు.
దళితులు, అణగారిన వర్గాలకు గౌరవం దక్కేలా కృషి చేశారని, అనాథలకు ఆశ్రయం కల్పించారని చెప్పారు. రైతుల హక్కుల కోసం పోరాడుతూ గులాంగిరి వంటి రచనలు చేసి చైతన్యం కలిగించారని వివరించారు.
సావిత్రిబాయి పూలే త్యాగాలను గుర్తుచేస్తూ, తీవ్ర ప్రతిఘటనల మధ్య కూడా మహిళా విద్య కోసం పోరాడిన గొప్ప మహిళగా కొనియాడారు. పూలే దంపతులు సామాజిక విప్లవానికి పితామహులుగా నిలిచారని పేర్కొన్నారు.
విద్య, సమానత్వం కోసం వారు చూపిన మార్గంలోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.