విశాఖలో మంత్రి వాసంశెట్టి సుభాష్ విస్తృత పర్యటన… ఈ-శ్రమ్ కార్డులపై అవగాహన
విశాఖపట్నం, ఏప్రిల్ 08:
రాష్ట్ర కార్మిక, కర్మాగారాల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విశాఖపట్నంలో రెండు రోజుల విస్తృత పర్యటన చేపట్టి పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పర్యటనలో భాగంగా రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు మరియు ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో మంత్రి సందర్శనలు చేపట్టి కార్మికులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ-శ్రమ్ కార్డులు కలిగి ఉన్నారా లేదా అనే విషయాన్ని కార్మికులను అడిగి తెలుసుకున్నారు.
పూర్ణ మార్కెట్ ప్రాంతంలో కార్మిక శాఖ అధికారులతో కలిసి పలువురు కార్మికులకు ఈ-శ్రమ్ కార్డుల రిజిస్ట్రేషన్ చేయించారు. జగదాంబ కూడలి, పూర్ణ మార్కెట్ మరియు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి కార్మికులకు అవగాహన కల్పించారు.
ఈ-శ్రమ్ కార్డుల ద్వారా కార్మికులకు లభించే ప్రయోజనాలను వివరించిన మంత్రి, ఇంకా కార్డులు పొందని వారు అవసరమైన ఆధారాలతో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు చేరవేయడమే ఈ పర్యటన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.