కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి
కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, ఏప్రిల్ 05: భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు, సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కొనియాడారు.
భారత మాజీ ఉపప్రధాని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను స్థానిక కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహోన్నత వ్యక్తి, భారత రాజకీయాల్లో ధృవతారగా నిలిచిన జగజ్జీవన్ రామ్ జయంతిని జరుపుకోవడం గర్వకారణమన్నారు. సమానత్వానికి ప్రతీకగా నిలిచిన ఆయన కేవలం నాయకుడు మాత్రమే కాకుండా సామాజిక సమానత్వం కోసం పోరాడిన యోధుడని అన్నారు. అంటరానితనం, వివక్ష అనే చీకట్లను చెరిపేసేందుకు అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారని పేర్కొన్నారు.
సాధారణ కుటుంబంలో జన్మించి దేశ ఉపప్రధాని స్థాయికి ఎదిగిన ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారని, దేశం ఆహార స్వయం సమృద్ధి సాధించడంలో ఆయన కృషి అపారమని వివరించారు.
రక్షణ శాఖ మంత్రిగా భారత్-పాక్ యుద్ధ సమయంలో ఆయన నాయకత్వంలో భారత సైన్యం చారిత్రాత్మక విజయాన్ని సాధించిందన్నారు. కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలను తీసుకువచ్చిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు.
ఆయన ఆశయాలను మాటల్లో కాకుండా కార్యరూపంలో చూపిస్తూ, కులమతాలకు అతీతంగా ప్రతి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందేలా పనిచేయడమే నిజమైన నివాళి అని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ మాట్లాడుతూ, ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న పథకాలు ప్రతి లబ్ధిదారునికి చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. “మనిషి పుట్టుకతో కాదు, తన గుణగణాలతో గొప్పవాడవుతాడు” అనే జగజ్జీవన్ రామ్ సందేశాన్ని స్మరించుకోవాలని అన్నారు.
ఏవో కే. కాశీ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే సామాజిక అసమానతలను ఎదుర్కొంటూ విద్య ద్వారా మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగిన మహానాయకుడని కొనియాడారు.
సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి పి. జ్యోతిలక్ష్మి దేవి మాట్లాడుతూ, అణచివేయబడిన వర్గాల హక్కుల కోసం అంకితభావంతో పోరాడిన మహానేతగా జగజ్జీవన్ రామ్ నిలిచారని తెలిపారు.
డీవీఎంసీ సభ్యులు పి. రజని మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజాసేవకుడిగా, దళితుల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన నాయకుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డీవీఎంసీ సభ్యులు శ్రీనివాస్ రాజు, డీటీఓ రామనాథం, హాస్టల్ విద్యార్థినులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.