కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను సందర్శించిన అనకాపల్లి జిల్లా అధికారులు
కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను సందర్శించిన అనకాపల్లి జిల్లా అధికారులు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా | ఏప్రిల్ 4, 2026 | ప్రజా ఆయుధం దినపత్రిక
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ కార్యాలయాన్ని అనకాపల్లి జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సందర్శించారు.
ఇటీవల కాలంలో ఈ కేంద్రం అందిస్తున్న వినూత్న సేవలను గమనించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇలాంటి సెంటర్లు అవసరమని సూచించారు. సమస్యలు వచ్చిన తర్వాత పరిష్కారం వెతకడం కాకుండా, ముందుగానే సమగ్రంగా సమస్యలను నిర్వహించే విధంగా కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ మోడల్‌ను అన్ని జిల్లాలు అమలు చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ సందర్శన జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల ద్వారా కేంద్రం పనితీరు, నిర్వహణ విధానం, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలపై అధికారులకు సమగ్ర వివరాలు అందించారు.
సందర్శన సందర్భంగా అధికారులు కేంద్ర స్థాపన ఉద్దేశ్యం, నిర్వహణ విధానం, సహాయక చర్యలు, రికార్డు నిర్వహణ, సమావేశాల విధానం, సమస్యల పరిష్కార ప్రక్రియ, అవగాహన కార్యక్రమాలు, సిబ్బంది బాధ్యతలు తదితర అంశాలపై సిబ్బందితో విస్తృతంగా చర్చించారు.
అదేవిధంగా టోల్ ఫ్రీ, ల్యాండ్‌లైన్, మొబైల్ ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కార విధానం, అభ్యర్థుల కేసుల నిర్వహణ, మెయిల్స్ మరియు లేఖల ద్వారా కమ్యూనికేషన్ విధానం గురించి కూడా వివరాలు తెలుసుకున్నారు.
కేంద్రం పనితీరుపై అధికారుల సందేహాలకు సమగ్ర సమాధానాలు అందించినట్లు కేంద్ర సమన్వయ అధికారి గోళ్ళ రమేష్ తెలిపారు.
ఈ సందర్శన ద్వారా కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ మోడల్‌ను ఇతర జిల్లాల్లో అమలు చేసే దిశగా ఒక కీలక ముందడుగు పడినట్లు అధికారులు అభిప్రాయపడ్డారు.