జిల్లాపై చెరగని ముద్ర వేసిన జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి – కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
అమలాపురం | ఏప్రిల్ 4, 2026 | ప్రజా ఆయుధం దినపత్రిక
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా టి. నిశాంతి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి తనదైన శైలిలో పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి జిల్లాపై చెరగని ముద్ర వేశారని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు.
శనివారం స్థానిక కలెక్టరేట్లో, జాయింట్ కలెక్టర్గా పనిచేసిన టి. నిశాంతి పదోన్నతి పొంది అల్లూరి సీతారామరాజు జిల్లాకు కలెక్టర్గా వెళ్తున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం ఘనంగా వీడ్కోలు సభను నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆమె సేవలను ప్రశంసించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో నిశాంతి చూపిన చొరవ అమోఘమని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా శాంతియుతంగా వ్యవహరిస్తూ అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం ఆమె ప్రత్యేకత అని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 21 నెలల పాటు జాయింట్ కలెక్టర్గా కీలక పాత్ర పోషించారని అన్నారు.
రెవెన్యూ క్రీడలు, క్విజ్ పోటీలు, రెవెన్యూ కేర్, ఓపెన్ హౌస్ వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించి తనదైన ముద్ర వేశారని తెలిపారు. రీ-సర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపినట్లు పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణ పథకాల అమలులో ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతంగా ముందుకు నడిపినట్లు కొనియాడారు.
వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు తీరప్రాంతంలో రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు ఆమె చేసిన కృషి ఫలితంగా త్వరలో రాడార్ కేంద్రం ఏర్పడనున్నదని తెలిపారు. తుఫానులు, గోదావరి వరదలు వంటి విపత్తుల సమయంలో క్షేత్రస్థాయిలో ఉండి యంత్రాంగాన్ని సమర్థంగా నడిపిన తీరు ఆదర్శనీయమన్నారు.
జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. రెవెన్యూ, పౌరసరఫరాలు, ధాన్యం కొనుగోలు వంటి అంశాల్లో ఆమె అంకితభావంతో పనిచేసి జిల్లాను ముందంజలో నిలిపారని అన్నారు.
అనంతరం మాట్లాడిన టి. నిశాంతి, జాయింట్ కలెక్టర్గా తనకు సహకరించిన జిల్లా కలెక్టర్, అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తాను సాధించిన విజయాలు మొత్తం టీమ్ వర్క్ ఫలితమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం ద్వారా లభించిన సంతృప్తి తనకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభవమని తెలిపారు.
ఏ జిల్లాలో ఉన్నా ప్రజల శ్రేయస్సే తన లక్ష్యమని, అదే నిబద్ధతతో పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు జి. మమ్మీ, భాగ్యవతి, జిల్లా అధికారులు డిఎస్ఓ ఉదయభాస్కర్, ఆర్టీవో శ్రీనివాసరావు, ఏవో కాశీ విశ్వేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.