స్కిల్స్ ఆధారిత విద్యతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్ రెడ్డి
-
స్కిల్స్ ఆధారిత విద్యతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జూలై 31: మారుతున్న కాలానికి అనుగుణంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అభ్యసించిన తర్వాత విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి A. Revanth Reddy తెలిపారు. ఉపాధ్యాయుల సహకారంతో తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ దాశరథి ఆడిటోరియంలో నిర్వహించిన టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్ కార్యక్రమంలో ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా అధ్యయన పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన ఉపాధ్యాయ ప్రతినిధులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, 12వ తరగతి పూర్తయ్యే సమయానికి ప్రతి విద్యార్థికి ప్రపంచంపై సమగ్ర అవగాహన ఉండేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం స్వయంగా పరిష్కరిస్తుందని, వారు విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు.
ప్రపంచ దేశాలు తెలంగాణ ప్రభుత్వ విద్యా సంస్థలను ఆదర్శంగా చూసేలా పనిచేద్దామని, వచ్చే ఐదేళ్లు సమాజం కోసం అంకితభావంతో సేవ చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన సంస్కరణలపై డిసెంబర్‌లోగా నివేదిక రూపొందించి, ప్రతి మండలాన్ని ఒక క్లస్టర్‌గా తీసుకుని కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
డీఎస్సీ ద్వారా 11 వేల ఉపాధ్యాయ పోస్టులను కేవలం 55 రోజుల్లో భర్తీ చేశామని, 23 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 30 వేల మందికి పైగా బదిలీలు కల్పించామని సీఎం తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు తమ సమస్యలకంటే విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు.
అమెరికాపై మాత్రమే దృష్టి పెట్టే పరిస్థితిని మార్చి, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, చైనా వంటి దేశాలపై దృష్టి సారించాలని అన్నారు. ఆ దేశాల్లో నైపుణ్యాలు కలిగిన వారికి విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, భాషతో పాటు స్కిల్స్ అభివృద్ధి అత్యంత అవసరమని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలతో పాటు ప్రతి కుటుంబంలో డాక్టర్లు, ఇంజినీర్లు, నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 9 శాతం కేటాయించామని, 27.50 లక్షల మంది విద్యార్థులపై ఒక్కొక్కరికి సగటున రూ.1.08 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వెల్లడించారు.
గత మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరిగాయని, ఈ విద్యా సంవత్సరంలో లక్షకు పైగా కొత్త అడ్మిషన్లు నమోదయ్యాయని చెప్పారు. ప్రభుత్వ విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రాష్ట్ర విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.
సమావేశానికి ముందు ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించిన ఉపాధ్యాయుల బృందం ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సీఎం వీక్షించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
![]()