కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలతో తలసరి ఆదాయం పెంపు లక్ష్యం: కలెక్టర్
ప్రజా ఆయుధం దినపత్రిక
కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలతో తలసరి ఆదాయం పెంపు లక్ష్యం: కలెక్టర్
ప్రజా ఆయుధం అమలాపురం, ఏప్రిల్ 25:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి ద్వారా తలసరి ఆదాయం పెంపు దిశగా పలు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ వెల్లడించారు.
శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జీఎంసీ బాలయోగి స్టేడియం అభివృద్ధికి రూ. 30 కోట్లు, రైతు బజారు అభివృద్ధికి రూ. 1 కోటి కేటాయించినట్లు తెలిపారు. వాటర్ గ్రిడ్ పథకం కింద రూ. 1650 కోట్లతో త్రాగునీటి సరఫరా ప్రాజెక్టులు మంజూరై, ఇప్పటికే నిర్మించిన 32 ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా సమృద్ధిగా నీటి సరఫరా జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
రోడ్లు, కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాలలో డంపింగ్ యార్డులు, స్మశాన వాటికల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని, తడి-పొడి చెత్త నిర్వహణకు ప్లాస్మా టెక్నాలజీ ఆధారిత లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానం త్వరలో అమలులోకి రానుందని చెప్పారు.
యువతకు క్రీడా సదుపాయాలు కల్పించేందుకు ప్రతి నియోజకవర్గంలో సుమారు 5 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి త్రీఫేజ్ కనెక్షన్లు, 400 కేవీ విద్యుత్ కేంద్రం నిర్మాణం, ఇన్సులేటెడ్ వైర్ల ఏర్పాటుతో లోవోల్టేజ్ సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు.
కొబ్బరి సాగు ఎక్కువగా ఉన్న కోనసీమలో కోకో పార్క్ స్థాపనకు సుమారు 100 ఎకరాల భూమి సేకరణ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. దీని ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోనసీమ ప్లాటర్ పేరిట స్థానిక ఆహార పదార్థాలను ప్రామాణికంగా విక్రయించే ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు.
చేనేత రంగాన్ని ఆధునిక టెక్నాలజీతో అనుసంధానం చేసి ఉపాధి అవకాశాలు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, కోయిర్ పార్కుల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. జిల్లాలో విద్యుత్, పారిశుధ్యం, క్రీడలు, పరిశ్రమల అభివృద్ధితో తలసరి ఆదాయం పెరుగుతుందని కలెక్టర్ వివరించారు.
ఈ సమావేశంలో డీఎస్ఓ ఏ. ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
![]()