పాకిస్తాన్ గడ్డపై గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న వరుస హత్యలు
పాకిస్తాన్ గడ్డపై గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న వరుస హత్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముసుగు ధరించిన వ్యక్తులు.. గుర్తు తెలియని బైక్ రైడర్లు అత్యంత పక్కా ప్రణాళికతో ఉగ్రవాద అగ్రనేతలను మట్టుబెడుతుండటం ఒక భారీ మిస్టరీగా మారింది. ముఖ్యంగా భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నిన, పలు ఉగ్రదాడుల్లో నిందితులుగా ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతుండటం గమనార్హం. లష్కరే తాయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి నిషేధిత సంస్థలకు చెందిన కీలక నేతలు వరుసగా హతమవుతున్నారు. గతంలో కాశ్మీర్లో రక్తపాతం సృష్టించిన వారు.. సరిహద్దుల గుండా డ్రోన్ల ద్వారా ఆయుధాలు పంపే నెట్వర్క్ నడిపిన వారు ఇప్పుడు పాక్‌లోనే సురక్షితం కాదని అర్థమవుతోంది. ఈ హత్యలు కేవలం కాల్పులకే పరిమితం కాకుండా అత్యంత ప్రొఫెషనల్ పద్ధతుల్లో జరుగుతున్నాయి. ప్రార్థనా మందిరాల వద్ద.. ఇంటి వెలుపల లేదా రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా దుండగులు మెరుపుదాడి చేసి క్షణాల్లో మాయమవుతున్నారు. దాడి జరిగిన ప్రదేశాల్లో సిసిటివి కెమెరాలు పనిచేయకపోవడం లేదా షూటర్లు ముఖాలను పూర్తిగా కప్పి ఉంచుకోవడం వల్ల పాక్ దర్యాప్తు సంస్థలు చేతులు ఎత్తేస్తున్నాయి.

పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ ఈ హత్యల వెనుక భారత గూఢచారి సంస్థ ‘రా’ హస్తం ఉందని బాహాటంగానే ఆరోపిస్తోంది. విదేశీ గడ్డపై ఉన్న శత్రువులను ఏరిపారేసే ‘నిశ్శబ్ద ఆపరేషన్లను’ భారత్ మొదలుపెట్టిందని పాక్ విశ్లేషకులు వాదిస్తున్నారు. అయితే భారత ప్రభుత్వం ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇవి పాకిస్తాన్ తన ఇంట్లో పెంచి పోషించిన పాములే ఇప్పుడు దాన్ని కరుస్తున్నాయని.. లేదా ఆ దేశ అంతర్గత వైఫల్యాలని భారత్ అభిప్రాయపడుతోంది. “ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేసే దేశం, దాని పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు” అని భారత దౌత్యవేత్తలు అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేస్తున్నారు.
ఈ మిస్టరీ హత్యల వెనుక ఎవరున్నారనే దానిపై ప్రధానంగా మూడు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థల మధ్య నిధుల పంపకం.. ప్రాబల్యం పెంచుకోవడం కోసం జరిగే గ్యాంగ్ వార్లు ఒక కారణం కావొచ్చు. ముఖ్యంగా పాత తరం నేతలను తొలగించి, యువ రక్తాన్ని ఎక్కించాలనే ఉద్దేశంతో కొత్త ముఠాలే ఈ పనే చేస్తున్నాయనే వాదన ఉంది. ఐఎస్ఐ ‘యూజ్ అండ్ త్రో’ పాలసీ.. ప్రపంచ దేశాల ఒత్తిడి పెరిగినప్పుడు, పనికిరాని పాత ఉగ్రవాదులను భారం అనుకుని ఐఎస్ఐ స్వయంగా వారినే తొలగిస్తూ ఉండొచ్చు. తద్వారా భారత్ పై నింద వేస్తూనే.. తమకు పనికిరాని వ్యక్తులను వదిలించుకునే వ్యూహం ఇది కావొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. గతంలో ఇజ్రాయెల్ వంటి దేశాలు అనుసరించినట్లుగా తమ దేశ భద్రతకు ముప్పుగా మారిన శత్రువులను విదేశీ గడ్డపైనే ఖతం చేసే విదేశీ గూఢచారి సంస్థల ‘సర్జికల్ ఆపరేషన్లు’ కూడా అయ్యే అవకాశం ఉంది.
కారణం ఏదైనా కారణం ఎవరైనా.. పాకిస్తాన్ ఇప్పుడు సురక్షిత స్వర్గధామం కాదనే సంకేతం ఉగ్రవాదులకు స్పష్టంగా చేరింది. భద్రతా వలయాల్లో ఉంటూ ఐఎస్ఐ అండతో తిరుగుతున్న వారు కూడా ఇప్పుడు బయటకు రావడానికి వణికిపోతున్నారు. ఈ ‘మిస్టరీ హత్యలు’ ముగిసేలా లేవు.. అలాగే వాటి వెనుక ఉన్న ‘అపరిచిత శక్తుల’ గుట్టు వీడేలా లేదు. ఒకప్పుడు టెర్రరిజానికి కేంద్రంగా ఉన్న పాక్.. ఇప్పుడు అదే టెర్రరిస్టులకు స్మశానవాటికగా మారుతోంది. ఈ పరిణామం దక్షిణాసియాలో ఉగ్రవాద నిర్మూలనకు ఒక కొత్త మలుపుగా మారుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.
![]()