జ్యోతిరావు పూలే ఆశయాలతో ముందుకు సాగాలి – ఏవో కాశీ విశ్వేశ్వరరావు
ప్రజా ఆయుధం దినపత్రిక
జ్యోతిరావు పూలే ఆశయాలతో ముందుకు సాగాలి – ఏవో కాశీ విశ్వేశ్వరరావు
అమలాపురం, ఏప్రిల్ 11:
యువత మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత విద్యతో సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టరేట్ పరిపాలనాధికారి కడలి కాశీ విశ్వేశ్వరరావు అన్నారు.
శనివారం స్థానిక కలెక్టరేట్లో మహాత్మ జ్యోతిరావు పూలే ద్విశత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లా ప్రజలకు, ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న వారందరికీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్యోతిరావు పూలే భారతదేశ సామాజిక ముఖచిత్రాన్ని మార్చిన మహనీయుడని, అసమానతలపై రాజీలేని పోరాటం చేసిన గొప్ప సంస్కర్త అని పేర్కొన్నారు. విద్య అనేది వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా సామాజిక విముక్తికి కూడా ప్రధాన సాధనమని ఆయన విశ్వసించారని అన్నారు.
మహిళలు, దళితులకు విద్య అందించేందుకు పూలే చేసిన కృషి అనన్యసామాన్యమని, స్త్రీ పురుష సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తన భార్య సావిత్రిబాయి పూలేను విద్యావంతురాలిగా తీర్చిదిద్దడం ద్వారా మహిళా విద్యకు శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదేనన్నారు.
జిల్లా పౌర సరఫరాల అధికారి ఉదయభాస్కర్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. సత్యశోధక సమాజ్ స్థాపన ద్వారా కుల వివక్ష నిర్మూలనకు కృషి చేశారని తెలిపారు.
బీసీ వెల్ఫేర్ అధికారి జ్యోతిలక్ష్మి దేవి మాట్లాడుతూ మహిళలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు.
డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చేటి చంద్రమౌళి మాట్లాడుతూ సమానత్వం, సౌభ్రాతృత్వం, విద్యా విలువలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శెట్టి బలిజి కార్పొరేషన్ సభ్యులు కడలి వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.